Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాడు విషాదంలోనూ నేను అసెంబ్లీకి వెళ్లడానికి కారణం అదే!: భూమా అఖిలప్రియ

తన తండ్రి భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత రెండు రోజులకే తాను అసెంబ్లీలో అడుగుపెట్టడానికి కారణం.. తమ పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం, భరోసా కల్పించేందుకేనని ఏపీ మంత్రి అఖిలప్రియ అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అఖిల ప్రియ మాట్లాడుతూ, తన తండ్రి చనిపోయిన మరుసటి రోజే తాను అసెంబ్లీకి వెళ్లడాన్ని పలువురు తప్పుబట్టిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.

అయితే, కార్యకర్తల్లో మనోధైర్యం, భరోసా కల్పించేందుకే అంతటి విషాదంలోనూ నాడు అసెంబ్లీకి వెళ్లానని చెప్పారు. ఉపఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగిన బ్రహ్మానందరెడ్డిని గెలిపించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని ఈ సందర్భంగా కోరారు. అంతకుముందు, మంత్రులు కేఈ కృష్ణమూర్తి, కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ, ఉప ఎన్నికల తర్వాత ఓటమి బాధతో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోక తప్పదని జోస్యం చెప్పారు. నంద్యాల ఉపఎన్నికల బరిలోకి తమ పార్టీ అభ్యర్థిని దింపిన జగన్, తనకు తానే రాజకీయ సమాధి కట్టుకున్నారని విమర్శించారు.

More Telugu News